భారత్ నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సైప్రస్ కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి టర్కీ...

భారత్ నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సైప్రస్ కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి టర్కీ అధికారికంగా ఫిర్యాదు చేసింది. తూర్పు మధ్యధరా ప్రాంతంలో సైప్రస్ చేపడుతున్న సైనిక కార్యకలాపాలు ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయని టర్కీ ఆందోళన వ్యక్తం చేసింది.
భారత్ తన ప్రత్యర్థి దేశాలైన అర్మేనియా, సైప్రస్, గ్రీస్‌లకు బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలను అందించడం ద్వారా 'యాంటీ-టర్కీ కూటమి'ని నిర్మిస్తోందని టర్కిష్ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ క్షిపణుల చేరిక తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతంలో భద్రతా సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుందని టర్కీ పేర్కొంటోంది. 2022 నుంచి అర్మేనియాకు భారత్ ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లను ఎగుమతి చేయడంపై కూడా టర్కీ, అజర్బైజాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
నవంబర్ 4న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీలకు టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్ ప్రతినిధి మురత్ సోయ్సల్ ఒక లేఖ రాశారు. సైప్రస్ ప్రభుత్వం తన ఏకపక్ష, బహుళపాక్షిక సైనిక కార్యకలాపాల ద్వారా ఆ ద్వీపం చుట్టుపక్కల ప్రాంతంలో శాంతిని విచ్ఛిన్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. సుమారు 650 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణుల సేకరణకు సంబంధించిన చర్చలపై ఆయన ప్రధానంగా అభ్యంతరం తెలిపారు.
సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ మే 2026లో న్యూఢిల్లీని సందర్శించిన తర్వాతే ఈ రక్షణ బంధం మరింత బలపడిందని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు యిహా కామికాజ్ డ్రోన్లను సరఫరా చేస్తూ టర్కీ బాహాటంగా మద్దతు ఇవ్వడంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు క్షీణించాయి. ప్రస్తుతం 'ఒకే జాతి, రెండు దేశాలు' సిద్ధాంతంతో నడుస్తున్న టర్కీ, అజర్బైజాన్లు భారత రక్షణ ఎగుమతుల విస్తరణపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి.