అమెరికాకు చెందిన ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ ఎన్బీసీలో ప్రసారమైన ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రకటనపై అమెరికన్ జ్యూయిష్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం ...

అమెరికాకు చెందిన ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ ఎన్బీసీలో ప్రసారమైన ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రకటనపై అమెరికన్ జ్యూయిష్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'సాటర్డే నైట్ లైవ్' థాంక్స్ గివింగ్ ప్రత్యేక కార్యక్రమంలో ప్రసారమైన ఈ ప్రకటన వాస్తవాలను దాచిపెట్టిందని కమిటీ సీఈఓ టెడ్ డ్యూచ్ గురువారం విమర్శించారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ ప్రకటనలో ఒక చిన్న బాలిక సైకిల్ కొనుగోలు కోసం 400 డాలర్లు పొదుపు చేస్తున్నట్లు చూపించారు. వెంటనే ఒక కాలు కోల్పోయి ఊతకర్రల సాయంతో నడుస్తున్న పాలస్తీనా చిన్నారి దృశ్యం కనిపిస్తుంది. అమెరికన్ పౌరులు చెల్లించే పన్నుల నుంచి మన ప్రభుత్వం ప్రతి మూడు సెకన్లకు 400 డాలర్ల సొమ్మును ఇజ్రాయెల్‌కు ఇలాంటి పనుల కోసమే పంపుతోందంటూ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ అంశంపై టెడ్ డ్యూచ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎన్బీసీ వైఖరిని ఎండగట్టారు. అమెరికా ఇజ్రాయెల్‌కు అందించే మద్దతే పాలస్తీనా చిన్నారి గాయపడటానికి కారణమంటూ కోట్ల మంది అమెరికన్లకు చూపేందుకు ఎన్బీసీ డబ్బు తీసుకుందని ఆరోపించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెలీలను దారుణంగా హత్య చేసి, చెరబట్టి యుద్ధాన్ని మొదలుపెట్టిన హమాస్ ఉగ్రవాదుల చర్యలను ఈ ప్రకటన పూర్తిగా తొక్కిపెట్టిందని ఆయన స్పష్టం చేశారు. హమాస్ ఉగ్రవాదులు పాలస్తీనా పౌరుల మధ్య నుంచే పోరాడుతున్నారని ఆయన తెలిపారు.
పాలస్తీనా పౌరుల బాధలు హృదయ విదారకమైనవే అయినప్పటికీ, హమాస్ ఆగడాలను ప్రస్తావించకుండా ఇజ్రాయెల్‌ను మాత్రమే దోషిగా చూపించడం సరైన చర్చ కాదని డ్యూచ్ పేర్కొన్నారు. పాలస్తీనా అనుకూల సంస్థ అయిన 'ఇన్స్టిట్యూట్ ఫర్ మిడిల్ ఈస్ట్ అండర్స్టాండింగ్ పాలసీ ప్రాజెక్ట్' ఈ ప్రకటన కోసం చెల్లింపులు చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొత్త సైనిక సహాయ ఒప్పందాన్ని అడ్డుకునే లక్ష్యంతో చేపట్టిన 'నో మోర్ ఫర్ ఇజ్రాయెల్' ప్రచారంలో భాగంగా దీనిని ప్రసారం చేశారు.