కరాచీలోని ఫవారా చౌక్ లేదా ఫూల్ చౌక్ జునా మార్కెట్ ప్రాంతంలో పాకిస్థాన్ జెండాను తొలగించి సింధ్ జెండాను ఆవిష్కరించినట్లు సమాచారం. సింధీ జాతీయ...
కరాచీలోని ఫవారా చౌక్ లేదా ఫూల్ చౌక్ జునా మార్కెట్ ప్రాంతంలో పాకిస్థాన్ జెండాను తొలగించి సింధ్ జెండాను ఆవిష్కరించినట్లు సమాచారం. సింధీ జాతీయవాదులు పాకిస్థాన్ జెండాను కిందకు దించి సింధ్ జెండాను ఎగరవేశారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా అక్కడ జీయే సింధ్ నినాదాలు హోరెత్తగా, రౌండ్‌బౌట్ వద్ద సింధుదేశ్ అనుకూల సందేశాలు కనిపించాయి. సరిగ్గా ఇదే ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం ఇలాంటి జెండా తొలగింపు ఘటనే జరిగినట్లు సమాచారం. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఖచ్చితమైన ప్రదేశం ఫవారా చౌక్ అని కొందరు చెప్పగా, మరికొన్ని వర్గాలు ఫూల్ చౌక్, జునా మార్కెట్ అని పేర్కొంటున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు.
గతంలో 2025 డిసెంబర్ 7వ తేదీన సింధీ కల్చర్ డే సందర్భంగా జీయే సింధ్ ముత్తహిదా మహాజ్ (జేఎస్‌ఎంఎం) నేతృత్వంలో కరాచీలో భారీ ర్యాలీ జరిగింది. ప్రత్యేక స్వతంత్ర సింధుదేశ్ డిమాండ్ చేస్తూ జరిగిన ఈ ర్యాలీలో ఆజాదీ, పాకిస్థాన్ ముర్దాబాద్ నినాదాలు హోరెత్తగా, అప్పట్లో రాళ్లదాడి, విధ్వంసం చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 5 మంది పోలీసు అధికారులు గాయపడగా, సుమారు 45 మందిని అరెస్ట్ చేశారు. జర్మనీలో ప్రవాస జీవితం గడుపుతున్న షాఫీ ముహమ్మద్ బుర్ఫాత్ 2000వ సంవత్సరంలో ఈ జేఎస్‌ఎంఎం పార్టీని స్థాపించారు.
అంతేకాకుండా 2026 నవంబర్ 13వ తేదీన వరల్డ్ సింధీ కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. సింధ్ ప్రాదేశిక సమగ్రత, గుర్తింపు, సింధు నది, తీరప్రాంతం, భూమి, సహజ వనరులపై హక్కుల పరిరక్షణ కోసం జేయే సింధ్ రహబర్ కమిటీ ఆధ్వర్యంలో 2026 నవంబర్ 22న కరాచీలో నిర్వహించతలపెట్టిన సింధ్ యూనిటీ మార్చ్‌కు ఆ సంస్థ మద్దతు ప్రకటించింది.