యూరప్‌లోని యూదు కమ్యూనిటీలు, పాశ్చాత్య ప్రయోజనాలపై ఇరాన్‌కు చెందిన ఉగ్రవాద నెట్‌వర్క్‌లు, ప్రాక్సీ గ్రూపుల ముప్పు తీవ్రమవుతోందని తాజా నివేద...

యూరప్‌లోని యూదు కమ్యూనిటీలు, పాశ్చాత్య ప్రయోజనాలపై ఇరాన్‌కు చెందిన ఉగ్రవాద నెట్‌వర్క్‌లు, ప్రాక్సీ గ్రూపుల ముప్పు తీవ్రమవుతోందని తాజా నివేదిక వెల్లడించింది. లండన్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) గురువారం ఈ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు జరిపిన తర్వాత యూరప్‌లో ఇరాన్ అనుకూల ఉగ్రవాద కార్యకలాపాలు వేగంగా పెరిగాయని సంస్థ తెలిపింది.
యూరప్ భద్రతా సంస్థలు తనిఖీలను ముమ్మరం చేసినప్పటికీ ఇరాన్ నెట్‌వర్క్‌లు దాడుల ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయని నివేదిక పేర్కొంది. రక్షణ తక్కువగా ఉండే సులువైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడంపై ఇరాన్ శక్తులు దృష్టి సారించాయి. ముఖ్యంగా యూరప్‌లోని యూదు కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకున్న కుట్రల వాటా గతంలో 21 శాతంగా ఉండగా, అది ఇప్పుడు ఏకంగా 57 శాతానికి పెరిగింది.
ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా (ఏసీఎల్ఈడీ) ప్రాజెక్ట్ గణాంకాల ఆధారంగా ఐఐఎస్ఎస్ ఈ నివేదికను రూపొందించింది. 2022 నుంచి యూరప్‌లో నమోదైన ఇరాన్ సంబంధిత ఘటనల్లో అత్యధికంగా 35 శాతం బ్రిటన్‌లోనే చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత జర్మనీలో 12 శాతం, ఫ్రాన్స్‌లో 10 శాతం, స్వీడన్‌లో 9 శాతం, నెదర్లాండ్స్‌లో 8 శాతం చొప్పున ఘటనలు నమోదయ్యాయి.
యూదులతో పాటు ఇరాన్ అసమ్మతివాదులు, జర్నలిస్టులు, ప్రముఖులను సైతం ఇరాన్ నెట్‌వర్క్‌లు వేధింపులకు గురిచేస్తున్నాయి. వీరు ఆస్తులకు నిప్పంటించడం, బాంబు దాడులు, బెదిరింపులు, కిడ్నాప్ కుట్రలతో పాటు హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. నమోదైన ఘటనల్లో 58 శాతం కేసుల్లో అనుమానితుల అరెస్టులు జరిగినప్పటికీ, టెహ్రాన్ తన కార్యకలాపాలను ఆపలేదని నివేదిక స్పష్టం చేసింది.