కెనడాలోని కళాశాల విద్యార్థుల్లో యూదు వ్యతిరేక భావజాలం ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో సంబంధా...

కెనడాలోని కళాశాల విద్యార్థుల్లో యూదు వ్యతిరేక భావజాలం ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలున్నాయనే భావనతో యూదుల ప్రార్థనా మందిరాలు లేదా వ్యాపార సంస్థల వద్ద నిరసనలు తెలపడం యూదు వ్యతిరేకత కాదని సగానికి పైగా, అంటే 54 శాతం మంది విద్యార్థులు భావిస్తున్నారు. కెనడా ప్రభుత్వం ఆదేశించిన ఈ ప్రత్యేక సర్వే నివేదిక నవంబర్ 26న విడుదలైంది.
ఈ ఆన్‌లైన్ సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో 36 శాతం మంది ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా యూదుల దుకాణాలను ధ్వంసం చేయడం తప్పు కాదని స్పష్టం చేశారు. అలాగే యూదుల యాజమాన్యంలోని సంస్థలను బహిష్కరించడం యూదు వ్యతిరేకత కిందకు రాదని 45 శాతం మంది విద్యార్థులు పేర్కొన్నారు. సర్వే సంస్థ లెగెర్ విద్యార్థుల వయసు, లింగం, ప్రాంతం, మాతృభాష, విద్యా స్థాయి ఆధారంగా 755 మంది విద్యార్థులతో ఈ సర్వేను నిర్వహించింది.
ఇజ్రాయెల్ దేశ చర్యలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను బాధ్యులను చేయడం పురాతన యూదు వ్యతిరేక రూపమని లాఫేర్ ప్రాజెక్ట్ సీనియర్ కౌన్సిల్ గెరార్డ్ ఫిలిట్టి తెలిపారు. ఇరాన్ పేరుతో మసీదును చుట్టుముట్టడాన్ని లేదా భారత్ పేరుతో హిందువుల దుకాణాలపై గుంపులుగా దాడి చేయడాన్ని ఎవరూ అంగీకరించరని ఆయన స్పష్టం చేశారు. శాంతియుత నిరసనలకు, బెదిరింపులకు మధ్య తేడాను విద్యార్థులు గుర్తించలేకపోతుంటే అది వారు చదువుకున్న విశ్వవిద్యాలయాల వైఫల్యమేనని ఆయన పేర్కొన్నారు.
2023 అక్టోబర్ 7 తర్వాత ఉత్తర అమెరికా వ్యాప్తంగా యూదుల వ్యాపారాలు, ప్రార్థనా మందిరాల వెలుపల ఇజ్రాయెల్ వ్యతిరేక గ్రూపుల నిరసనలు తీవ్రమయ్యాయి. ఇటీవల న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న ఎస్సెన్ ఎన్‌వై అనే యూదుల రెస్టారెంట్ ఎదుట హిజ్బుల్లా జెండాలతో నిరసనకారులు ఆందోళన చేపట్టగా న్యూయార్క్ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. కెనడాలోనూ ప్రార్థనా మందిరాలకు వెళ్లేవారిని అడ్డుకోవడం, భయభ్రాంతులకు గురిచేయడం ఫెడరల్ చట్టాల ప్రకారం నేరంగా పరిగణిస్తారు.