భారతదేశ విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు జీఈ ఏరోస్పేస్ సంస్థ తన భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తోంది. దేశీయంగా అత్యాధున...

భారతదేశ విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు జీఈ ఏరోస్పేస్ సంస్థ తన భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తోంది. దేశీయంగా అత్యాధునిక తయారీ వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు రక్షణ, విమానయాన రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.
దేశీయ తయారీలో రఘు వంశీ మెషిన్ టూల్స్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంస్థ ప్రస్తుతం భారతదేశంలో ఆరు, బ్రిటన్‌లో మూడు, అమెరికాలో ఒక ఉత్పత్తి కేంద్రంతో సహా 200కు పైగా అత్యాధునిక సీఎన్సీ మెషిన్లను నిర్వహిస్తోంది. రఘు వంశీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్ గణేశుల 2013లో జీఈ ఏరోస్పేస్ నుంచి తమ మొదటి ఆర్డర్‌ను అందుకున్నారు. అనంతరం జీఈ బృందం ఫ్యాక్టరీ లేఅవుట్ రూపకల్పన, నాణ్యతా ప్రమాణాలు, తమ 'ఫ్లైట్ డెక్' ఆపరేటింగ్ మోడల్‌ను అందించడం ద్వారా ఉత్పత్తి నాణ్యతను పెంచింది.
గురుగ్రామ్‌లో అక్టోబర్ 12, 2026న నిర్వహించిన 'ఇండియా టేకింగ్ ఫ్లైట్' సదస్సులో ఎర్నస్ట్ అండ్ యంగ్ రూపొందించిన 'పవరింగ్ ప్రోగ్రెస్: జీఈ ఏరోస్పేస్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఇన్ ఇండియా' నివేదికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశా ఎయిర్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధన దిశగా దేశంలో భాగస్వామ్యాల విస్తరణపై చర్చించారు.
భారత్‌లో వాణిజ్య విమానయాన రంగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని జీఈ ఏరోస్పేస్ దక్షిణాసియా సీఈవో విక్రమ్ రాయ్ తెలిపారు. తమ సంస్థ కార్యకలాపాలు కేవలం ఇంజిన్ల విక్రయానికే పరిమితం కాదని, పుణెలో తయారవుతున్న విడిభాగాలు, బెంగళూరులో జరుగుతున్న ఆవిష్కరణలతో తదుపరి తరం ఏరోస్పేస్ రంగాన్ని నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.