త్రిపురలోని సిపాహిజాలా జిల్లా సరిహద్దు ప్రాంతంలో అధికారులు భారీ ఎన్‌క్రోచ్‌మెంట్ డ్రైవ్ చేపట్టారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని ఆశాబరి వద్...

త్రిపురలోని సిపాహిజాలా జిల్లా సరిహద్దు ప్రాంతంలో అధికారులు భారీ ఎన్‌క్రోచ్‌మెంట్ డ్రైవ్ చేపట్టారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని ఆశాబరి వద్ద ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కనీసం ఏడు ఇళ్లను నేలమట్టం చేశారు. సరిహద్దు భద్రతా బలగాలపై దాడి జరిగిన కొద్ది వారాల్లోనే జిల్లా యంత్రాంగం ఈ చర్యలు చేపట్టింది.
కలంఛోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎస్ఎఫ్ 49వ బెటాలియన్ బోర్డర్ అవుట్‌పోస్ట్ సమీపంలో ఉదయం 11 గంటలకు ఈ కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. తీవ్ర భద్రతా ఏర్పాట్ల మధ్య స్థానిక పోలీసులు, సరిహద్దు భద్రతా బలగాలను భారీగా మోహరించారు. అధికారులు బుల్డోజర్లను రంగంలోకి దించి అక్రమ నిర్మాణాలను తొలగించి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు.
నవంబర్ 2వ తేదీన ఆశాబరి ప్రాంతంలో బీఎస్ఎఫ్ సిబ్బందిపై కొందరు దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతంలో భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ ఘటన తర్వాత యంత్రాంగం సరిహద్దుల్లోని ప్రభుత్వ భూములను కొలతలు వేసి ఆక్రమణలను నిర్ధారించింది. స్థలాలు ఖాళీ చేయాలంటూ ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి, చర్చలు జరిపినప్పటికీ వారు స్పందించలేదు. స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేయకపోవడంతో యంత్రాంగం బుల్డోజర్లతో చర్యలు చేపట్టింది.
ఈ ప్రాంతంలో మరికొన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సరిహద్దు వెంట ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు తదుపరి దశల్లో మిగిలిన నిర్మాణాలను కూడా కూల్చివేయనున్నారు. మరోవైపు కొందరు ఆక్రమణదారులకు సరిహద్దు స్మగ్లింగ్ ముఠాలు, మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్నాయన్న నిఘా వర్గాల అనుమానాలపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. సరిహద్దు గ్రామాల్లోని నివాసితుల గుర్తింపు, పౌరసత్వ పత్రాలను కూడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.