Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఘర్ వాపసీకి అనుమతించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించిన క్రైస్తవ కుటుంబం - Christian family moves Kerala HC for Ghar Wapasi

ఘర్ వాపసీ ద్వారా హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కొల్లాం జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది క్రైస్తవులు ...

ఘర్ వాపసీకి అనుమతించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించిన క్రైస్తవ కుటుంబం

ఘర్ వాపసీ ద్వారా హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కొల్లాం జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది క్రైస్తవులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కొట్టారక్కర శ్రీ మహాగణపతి ఆలయంలో ఘర్ వాపసీ క్రతువు నిర్వహించేలా ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించాలని వారు పిటిషన్ దాఖలు చేశారు.

జస్టిస్ దేవన్ రామచంద్రన్, జస్టిస్ బసంత్ బాలాజీలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఆలయంలో ఘర్ వాపసీ క్రతువు అధికారిక ఆచారంగా ఉన్నప్పటికీ, తమ దరఖాస్తులపై దాదాపు ఐదు నెలలుగా ఆలయ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్లు ఆరోపించారు.

అధికారుల నిర్లక్ష్యం రాజ్యాంగంలోని 14, 21, 25వ అధికరణల కింద తమ హక్కులను ఉల్లంఘించడమేనని కుటుంబం పేర్కొంది. అంతేకాకుండా 1950 నాటి ట్రావెన్‌కోర్-కొచ్చిన్ హిందూ మత సంస్థల చట్టంలోని సెక్షన్ 15ఏ, 31 నిబంధనలను దేవస్వమ్ బోర్డు ఉల్లంఘించిందని తెలిపింది. పిటిషనర్లలో ఒకరైన వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని, తన జీవితకాలంలోనే ఘర్ వాపసీ ద్వారా హిందూ ధర్మంలోకి వచ్చి, హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరుపుకోవాలని కోరుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటిషనర్ల పూర్వీకులు కురవ వర్గానికి చెందిన హిందువులని, ఆ తర్వాత ఒక తరం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించిందని తెలిపారు. ఇప్పుడు ఎవరి బలవంతం లేదా ప్రలోభం లేకుండా స్వచ్ఛందంగానే ఘర్ వాపసీ ద్వారా తమ పూర్వీకుల ధర్మంలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆలయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తిరస్కార ధోరణి కనబరిచారని పిటిషనర్లు వెల్లడించారు.

ఆలయ అడ్వైజరీ కమిటీ జూన్ 27న అడ్మినిస్ట్రేటర్‌కు లేఖ రాస్తూ కేంద్ర, రాష్ట్ర చట్టాల ప్రకారం మతమార్పిడి నిషేధమని పేర్కొందని పిటిషనర్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే వివాదాలు చెలరేగి ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతుందని, క్రైస్తవ సంస్థల నుంచి ఫిర్యాదులు రావచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ వ్యవహారాన్ని దేవస్వమ్ బోర్డు కమిషనర్‌కు నివేదించారు.