Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

Breaking

latest

గంగా జలాల ఒప్పందం పునరుద్ధరణకు బంగ్లాదేశ్ సిద్ధం - Bangladesh ready for Ganga water treaty renewal

భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య కీలకమైన గంగా జలాల ఒప్పందం పునరుద్ధరణపై చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల రాష...

గంగా జలాల ఒప్పందం పునరుద్ధరణకు బంగ్లాదేశ్ సిద్ధం

భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య కీలకమైన గంగా జలాల ఒప్పందం పునరుద్ధరణపై చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి షమా ఒబేద్ ఇస్లాం తెలిపారు. ఈ ఒప్పందాన్ని తాము కొనసాగించాలనుకుంటున్నామని, దీనిపై భారత్ తో చర్చలు జరపాలని కోరుకుంటున్నామని ఆమె వెల్లడించారు. ఈ ఒప్పందం 2026 డిసెంబర్ లో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్, బంగ్లాదేశ్ మధ్య 54 నదులు భాగస్వామ్యంగా ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఏకైక సమగ్ర నీటి పంపిణీ ఒప్పందం 1996 నాటి గంగా జలాల ఒప్పందమే. పరస్పర సమ్మతితో పొడిగించే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఈ నదీ పరీవాహక ప్రాంత సహకార ఒప్పందం డిసెంబర్ 12న గడువు ముగియనుంది. భవిష్యత్తులో జనాభా పెరగడం, వాతావరణ మార్పుల సంక్షోభాల కారణంగా భవిష్యత్తు అవసరాలను ఈ ఒప్పందం పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.

ఈ ఒప్పందానికి కేంద్రమైన ఫరక్కా బ్యారేజీ భారత ప్రయోజనాలతో ముడిపడి ఉంది. పొడి నెలల్లో పూడిక పేరుకుపోయి కోల్‌కతా ఓడరేవుకు నౌకాయానం కష్టమవుతుండటంతో, గంగా నీటిని హుగ్లీ నదిలోకి మళ్లించి ఓడరేవును కాపాడేందుకు భారత ప్రభుత్వం ఫరక్కా బ్యారేజీని నిర్మించింది. 1975 ఏప్రిల్ 21న ఇది ప్రారంభమైంది. ఒప్పందం ప్రకారం ఫరక్కా వద్ద ప్రవాహం 70,000 క్యూసెక్కులు లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఇరు దేశాలకు చెరి 50 శాతం దక్కుతుంది. 70,000 నుంచి 75,000 క్యూసెక్కుల మధ్య ఉంటే బంగ్లాదేశ్‌కు 35,000 క్యూసెక్కులు, 75,000 క్యూసెక్కులకు మించితే భారత్‌కు 40,000 క్యూసెక్కులు లభిస్తాయి. మార్చి 11 నుంచి మే 10 వరకు ప్రతి దేశానికి వంతుల వారీగా పది రోజుల పాటు 35,000 క్యూసెక్కులకు హామీ ఉంది.

ఉమ్మడి నదుల కమిషన్ సమాచారం ప్రకారం 1997 నుండి 2024 మధ్య కాలంలో మార్చి 11 నుండి మే 10 వరకు కీలకమైన కాలంలో ఫరక్కా వద్ద ప్రవాహం షెడ్యూల్ చేసిన మొత్తం కంటే దాదాపు 43 శాతం తక్కువగా ఉంది. ఈ ఒప్పందాన్ని ఇరు దేశాల పరస్పర అంగీకారంతోనే పునరుద్ధరించాలి.

గంగా నది పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా వద్ద రెండుగా చీలుతుంది. తూర్పు వైపు బంగ్లాదేశ్‌లోకి పద్మగా ప్రవహిస్తుంది, పశ్చిమ బెంగాల్‌లో భగీరథిగా కొనసాగి, జలంగి నది కలిసిన తర్వాత హుగ్లీ పేరుతో కోల్‌కతా మీదుగా ప్రవహిస్తుంది.