ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 వేల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది. 2028 నాటి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 వేల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది. 2028 నాటికి ఈ ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ ఆలయాల నిర్మాణానికి సహకారం అందించనున్నారు.
రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపట్టే ఈ ఆలయాల నిర్మాణానికి ఒక్కో దానికి 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు కేటాయించనున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో, అలాగే గణనీయమైన హిందూ జనాభా ఉన్న విదేశీ ప్రాంతాలలో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రతి ఆలయంలోనూ అన్న ప్రసాదం సదుపాయాలను అందించనున్నట్లు పేర్కొన్నారు.
తిరుమలలో చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్, ఆయన భార్య రాధిక జైన్ దంపతులు శ్రీ వేంకటేశ్వర స్వామికి 121 కేజీల బంగారం, డైమండ్ స్టడెడ్ ఆభరణాలను విరాళంగా అందజేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వివరాలను వెల్లడించారు. భక్తులు సమర్పించే ప్రతి రూపాయిని వారి సౌకర్యాలకే టీటీడీ వెచ్చిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మానవ సేవయే మాధవ సేవ అని, సంపద శాశ్వతం కాదని, తోటి వారికి సేవ చేయడమే నిజమైన ఆనందమని ఆయన అన్నారు.
భక్తులు అందించే విరాళాలతో పాటు ప్రాణదానం కింద వైద్య సహాయం, అంకితమైన నిధి ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి తిరుమల ఆలయానికి రాజులు, ప్రముఖులు అందించిన విరాళాల సంప్రదాయం కొనసాగుతోందని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు.