సియాచిన్.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ భూమి. అత్యంత కఠినతర పరిస్థితులను ఎదుర్కొంటున్న సైన్యం, ప్రాణాలొడ్డి మరీ ప్రాంతానికి ఇక్కడ పహారా కా...
చలికాలంలో అక్కడి ఉష్ణోగత్రలు -50 డిగ్రీలకు పడిపోతాయి. సియాచిన్‌లో భారత సైనికుల చిట్టచివరి క్యాంప్‌ని ‘ఇంద్ర కాల్’ అని పిలుస్తారు. బేస్ క్యాంప్ నుంచి అక్కడికి చేరుకోవడానికి సైనికులు 20-22 రోజుల పాటు నడవాలి. ఆ మంచులో, చలిలో ఒంటరిగా నడవడం కూడా ప్రమాదకరమే. మంచుగడ్డలు ఎప్పుడు కుంగిపోయి గోతులు ఏర్పడతాయో తెలీదు. అందుకే సైనికులంతా నడుముకు తాడు కట్టుకొని ఒకరి వెనక ఒకరు క్యూలో నడుస్తూ ఒక్కో చెక్ పోస్ట్‌కు చేరుకుంటారు.
ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి సైనికులు వేగంగా నడవడానికి కూడా వీల్లేదు. ఒక్కో క్యాంపుకి ఎంత సేపట్లో చేరాలో, అక్కడ ఎంత సేపు ఆగాలోనన్న నియమాలు కూడా పక్కాగా ఉంటాయి. దారి మధ్యలో ఎన్నో ఎత్తుపల్లాలు, గోతులు కనిపిస్తాయి. చెట్లు, పక్షులు, జంతువులు లాంటివేమీ కనిపించవు. అక్కడ మంచుమీద పడే సూర్య కిరణాలను నేరుగా చూసినా కూడా కంటిపై ప్రతికూల ప్రభావం పడి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. రాత్రులు గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎగిరొచ్చే మంచు శరీరానికి ముళ్లలా గుచ్చుకుంటుంది.
అందుకే సైనికులు అనేక పొరలుగా మందపాటి దుస్తులను వేసుకుంటారు. ఆయుధాల బరువుకు తోడు దుస్తులు, బూట్ల బరువు సైనికులకు మరింత భారమవుతుంది. సైనికులు చెక్క బళ్లలపై స్లీపింగ్ బ్యాగ్స్‌లో పడుకుంటారు. కానీ నిద్ర కూడా వాళ్లకు ప్రమాదకరమే. ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో ఒక్కోసారి నిద్రలోనే వాళ్లు ప్రాణాలు కోల్పోతారు. ఆ ప్రమాదాన్ని నివారించడానికి సైనికులను గార్డులు మధ్య మధ్యలో మేల్కొలుపుతుంటారు. నిజానికి అంత ఎత్తులో నిద్ర కూడా సరిగ్గా పట్టదు.
ఇక స్నానం గురించి ఆలోచించే సాహసం కూడా వారు చేయరు. ఆ వాతావరణానికి చర్మం చాలా సున్నితంగా మారిపోతుంది. షేవింగ్ చేసుకుంటే చర్మం ఊడొచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ పనికి కూడా వాళ్లు దూరంగా ఉంటారు. ఒక్కో సైనికుడికి మూడు నెలల పాటు అక్కడ పోస్టింగ్ వేస్తారు. వాళ్లకు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే సైనికులు ఆ మూడు నెలలూ పహారా కాయాల్సి ఉంటుంది.
భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండటంతో సైనికులకు అక్కడ పెద్దగా పనుండదు. ఉన్నంత సేపు ఖాళీగానే సమయాన్ని గడపాల్సి వస్తుంది. సియాచిన్‌ను గస్తీ కాయడంలో వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడ సేవలందించే హెలికాప్టర్ పేరు ‘చీతా’. అంత ఎత్తుకు ఆ హెలికాప్టర్లు మాత్రమే వెళ్లగలవని ఆర్మీ చెబుతుంది.
కాల్పుల విరమణకు ముందు ఒక్కో చెక్ పాయింట్ దగ్గర కేవలం 30 సెకన్లు మాత్రమే అవి ఆగేవి. ప్రత్యర్థులు స్పందించే లోగానే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఇలా చేసేవి. ఇప్పుడు కూడా సైనికులను అన్ని పరిస్థితులకు సమాయత్తం చేసేందుకు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. సైనికులకు అక్కడ వినోదానికి ఎలాంటి సాధనాలూ అందుబాటులో ఉండవు. ఎటు చూసినా తెల్లగా మెరిసే మంచు కొండల మధ్యే నిత్యం అప్రమత్తంగా ఉంటూ కఠిన వాతావరణాన్ని ఎదుర్కొంటూ కాలం గడపాలి.