ముంబై: అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీవీ షో ‘పాండ్యా స్టోర్’ సెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున మంటలు వ్యాపించడంతో ...
ముంబై: అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీవీ షో ‘పాండ్యా స్టోర్’ సెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున మంటలు వ్యాపించడంతో సెట్‌లోని వస్తువులు కాలి బూడిదయ్యాయి. అయితే ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రూ.కోట్లలో నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.
సంజయ్ వాద్వా, కోమల్ సంజయ్ వాద్వా నిర్మాణంలో స్టార్ ప్లస్ ఛానల్‌లో జనవరి 25 నుంచి ‘పాండ్యా స్టోర్’ అనే టీవీ షో ప్రసారం మొదలైంది. షైనీ దోషి, కిన్షిక్ మహాజన్ పాత్రధారులుగా ఈ షో ప్రారంభమైంది. ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే మంచి గుర్తింపు వచ్చింది. తమిళంలో వచ్చిన పాండ్యాన్ స్టోరీస్‌ను రీమేక్ చేస్తూ ‘పాండ్యా స్టోరీ’ చేస్తున్నారు. అయితే ముంబై శివారులోని గోరెగావ్‌లో ఉన్న ఫిల్మ్ సిటీలో శనివారం తెల్లవారుజామున 2.30 సమయంలో ప్రమాదం సంభవించింది. సెట్‌లోని మేకప్ రూమ్ నుంచి మొదట మంటలు వ్యాపించాయి.
అనంతరం ఆ మంటలు సెట్టంతా వ్యాపించాయి. మంటల్లో క్యాస్టూమ్స్, విలువైన సామగ్రి, షూటింగ్ సామగ్రి తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. రూ.కోట్లలో నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. నటీనటులు, షూటింగ్ బృందం అందరూ క్షేమంగా ఉన్నారని.. అయితే ప్రమాదంతో కొంత నష్టం ఏర్పడిందని షో నిర్వాహకులు ప్రకటించారు. సెట్‌లోని కొంత భాగం దగ్ధమైందని తెలిపింది. ఈ ఘటనతో ఆ షోకు కొన్ని రోజులు ఆగిపోయే అవకాశం ఉంది.