బుకారెస్ట్: ఆమె అందమే ఆమె పాలిట శాపమైంది. చాలా అందంగా ఉన్నదన్న కారణంతో ఉద్యోగం నుంచి తొలగించారు. రొమేనియాకు చెందిన 27 ఏండ్ల సుందరాంగి క్లా...
బుకారెస్ట్: ఆమె అందమే ఆమె పాలిట శాపమైంది. చాలా అందంగా ఉన్నదన్న కారణంతో ఉద్యోగం నుంచి తొలగించారు. రొమేనియాకు చెందిన 27 ఏండ్ల సుందరాంగి క్లాడియా ఆర్డిలియన్ తన అంద చందాలతో ఎన్నో బ్యూటీ కాంటెస్ట్‌ల్లో గెలిచారు. అయితే అందమే ఆమె ఉద్యోగానికి ఎసరుతెచ్చింది. దీంతో ఆమె బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. లా, యూరోపియన్ నీతిశాస్త్రంలో క్లాడియా డ్యూయల్ డిగ్రీ పొందారు. ఈ నేపథ్యంలో రొమేనియన్ న్యుమోనియా క్లినికల్ హాస్పిటల్ బోర్డులో ఆమెకు జీతం లేని కొలువు లభించింది.
కొత్త ఉద్యోగంలో చేరిన ఆనందంతో విధులకు హాజరైన క్లాడియా తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు పలు విమర్శలు చేశారు. ఆమెకు ఎలాంటి అర్హతలు లేకపోయినా మోడల్, అందగత్తె కావడం వల్లనే ఆ ఉద్యోగం ఇచ్చారని విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలో క్లూజ్ సిటీ కౌన్సిల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నది. ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేయాలని క్లాడియాను డిమాండ్ చేసింది. దీంతో తాను బలవంతంగా ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆమె వాపోయారు. ఈ నిర్ణయాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు బిజినెస్ మ్యగజిన్‌తో క్లాడియా అన్నారు.
కొంతమంది ప్రతిచర్యలు అతీతంగా ఉంటాయని క్లాడియా వ్యాఖ్యానించారు. తన నియామకాన్ని సమర్థించడానికి అవసరమైన నైపుణ్యాలు, విద్యార్హతలు తనకు ఉన్నాయని తెలిపారు. వృత్తిపరంగా తాను న్యాయవాదినని, డ్యుయల్ డిగ్రీ కలిగి ఉన్నట్లు చెప్పారు. సొంతంగా హోస్టెస్ ఏజెన్సీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే దురదృష్టవశాత్తు రొమేనియాలో పక్షపాతాలు ఇప్పటికీ ఉన్నాయని విమర్శించారు. ఒకరి వృత్తిని అందం ప్రభావితం, అడ్డుకోవడం చేయకూడదని తాను నమ్ముతానని అన్నారు. ప్రస్తుతం తాను న్యాయవాదిగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు క్లాడియాను ఆ ఉద్యోగం నుంచి తప్పించినందుకు తనకు చాలా బాధకలిగిందని క్లూజ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అలిన్ టిస్ తెలిపారు. అయితే ఆమె నియామకానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు లేదా నిందలు రాకుండా ఉండేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని వివరించారు.