న్యూఢిల్లీ: ఒకే జెండర్ వారి మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తిస్తూ.. చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో ...
న్యూఢిల్లీ: ఒకే జెండర్ వారి మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తిస్తూ.. చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో దాఖలైన పిటిషన్‌ని కేంద్రం వ్యతిరేకించింది. అతి పెద్ద శాసన చట్రం కేవలం స్త్రీ, పురుషుల మధ్య జరిగే వివాహాలను మాత్రమే గుర్తిస్తుందని స్పష్టం చేసింది. వ్యక్తిగత చట్టాలు కూడా ఇలాంటి వివాహాలనే గుర్తిస్తాయని.. వీటిలో తల దూర్చితే భారీ వినాశనం తప్పదని హెచ్చరించింది.
అంతేకాక ‘‘వివాహం అనేది ఓ ప్రైవేట్ కాన్సెప్ట్ కాదని.. స్వంత ప్రజా ప్రాముఖ్యత కలిగిన సామాజికంగా గుర్తింపు పొందిన వ్యవస్థ అని కేంద్రం తెలిపింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 377 యొక్క డిక్రిమినలైజేషన్ ఉన్నప్పటికీ, పిటిషనర్లు స్వలింగ వివాహాన్ని ప్రాథమిక హక్కుగా పొందలేరు’’ అని సెంటర్ అఫిడవిట్లో పేర్కొంది. జెండర్‌తో సంబంధం లేకుండా ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాల్సిందిగా కోరుతూ.. గే, లెస్బియన్ కమ్యూనిటీకి చెందిన నలుగరు ఢిల్లీ హై కోర్టు ను ఆశ్రయించారు.
జస్టిస్ రాజీవ్ సహై ఎండ్లా, అమిత్ బన్సాల్ ధర్మాసనం ఈ విజ్ఞప్తిపై కేంద్రం స్పందనని కోరింది. దీనిపై కేంద్రం బదులిస్తూ.. ‘‘భారతీయ సమాజంలో వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను కలిపే ప్రకియ కాదు.. స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని ఏర్పరిచే వ్యవస్థ. కనుక స్వలింగ సంపర్కుల మధ్య జరిగే వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని వెల్లడించింది. ఈ విషయంలో న్యాయపరంగా జోక్యం చేసుకుంటే ‘‘వ్యక్తిగత చట్టాల సున్నితమైన సమతుల్యత పూర్తి నాశనానికి కారణమవుతుంది’’ అని అభిప్రాయపడింది. భర్త అంటే బయోలాజికల్‌గా పురుషుడు.. భార్య అంటే కేవలం మహిళ మాత్రమే. కనుక ఒకే లింగ వారి మధ్య జరిగే వివాహాలను సమర్థించం అని కేంద్రం తెలిపింది.