బంజారాహిల్స్ : అంతర్జాతీయ క్రికెట్ టీమ్‌కు నాగరాజు అనే రంజీ ప్లేయర్ సెలక్ట్ అయ్యాడని, ఆయన క్రికెట్ కిట్ కొనుగోలుకు కొంతడబ్బు స్పాన...
బంజారాహిల్స్ : అంతర్జాతీయ క్రికెట్ టీమ్‌కు నాగరాజు అనే రంజీ ప్లేయర్ సెలక్ట్ అయ్యాడని, ఆయన క్రికెట్ కిట్ కొనుగోలుకు కొంతడబ్బు స్పాన్సర్ చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డి పేరుతో ఓ వ్యక్తి విష్ణు కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీకి నకిలీ ఫోన్‌కాల్ చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింగనర్ రోడ్ నెంబర్.7లో ఉన్న విష్ణు కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ మల్లకోసుల సురేష్ కుమార్(42)కు గతేడాది డిసెండర్ 24న తాను ఐటీ మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డినంటూ ఫోన్‌చేసి నాగరాజుకు రూ. 4.78 లక్షలు ఇవ్వాల్సిందిగా సూచించాడు.
ఆ డబ్బును ఏపీ నర్సన్నపేట బరోడా బ్రాంచ్ బ్యాంక్‌కు బదిలీ చేయాలని సూచించాడు. దీంతో గతేడాది డిసెంబర్ 26న ఆ నెంబర్‌కు రూ. 26వేలు బదిలీ చేశాడు. ఆ తర్వాత తరుచూ ఆ వ్యక్తి నుంచి డబ్బు కోరుతూ డిమాండ్లు పెరగసాగాయి. ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి మంత్రి కేటీఆర్ పీఏ కాదని, తనను పక్కదారి పట్టించిన నాగరాజుగా గుర్తించారు. ఇటీవల ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో తాము మరింత లోతుగా విచారించగా నకిలీ ఫోన్ చేసిన నాగరాజుపై అనుమానం వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.