హైదరాబాద్: ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కంభంపాటి, టీటీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ అరవింద్ కుమార్ గౌడ్ ...
హైదరాబాద్: ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కంభంపాటి, టీటీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ అరవింద్ కుమార్ గౌడ్ హాజరైనారు. సమావేశానంతరం అరవింద్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టా భద్రుల స్థానానికి టీటీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేస్తున్నారని ప్రకటించారు. నల్గొండ-వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో ఎవరికి మద్దతివ్వలానే అంశంపై అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అరవింద్ తెలిపారు. తీవ్ర తర్జనభర్జన అనంతరం ఈ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణిదేవి పేరును ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు. ఇదే స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి ఎన్.రాంచందర్‌రావు పోటీ చేస్తున్నారు. మొత్తం నియోజకవర్గంలో 517883 మంది ఓటర్లు ఉండగా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లాలో 1,16,704 మంది ఓటర్లు నమోదయ్యారు. ఈ నియోజకవర్గానికి మార్చి 14న ఎన్నికలు నిర్వహిస్తారు.
2007లో నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నిక జరగ్గా టీఆర్‌ఎస్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. తొలి రెండు ఎన్నికల్లో వామపక్షాల డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలవగా, మూడోసారి 2015లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, ప్రముఖ న్యాయవాది ఎన్.రాంచందర్‌రావు విజయం సాధించారు. తాజాగా జరిగే ఎన్నికల్లోనూ ఈ ఇద్దరు నేతలు బరిలో దిగుతున్నారు.