పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత బడులు, కాలేజీలు సోమవారం(నేడు) నుంచి తెరచుకోనున్నాయి. కోవిడ్–19 కారణంగా గత ఏడాది మార్చి 16 నుంచి ప్రత్యక్...
పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత బడులు, కాలేజీలు సోమవారం(నేడు) నుంచి తెరచుకోనున్నాయి. కోవిడ్–19 కారణంగా గత ఏడాది మార్చి 16 నుంచి ప్రత్యక్ష విద్యా బోధనకు దూరమైన విద్యార్థుల్లో.. 9, ఆపై తరగతులకు చెందిన విద్యార్థులకు మళ్లీ తరగతి గదుల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం అవుతోంది. ముఖ్యమంత్రి
కేసీఆర్ ఆదేశాల మేరకు, కోవిడ్ నిబంధనలతో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేందుకు పాఠశాల, ఇంటర్మీడియట్, కళాశాల, సాంకేతిక విద్యాశాఖలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
పాఠశాలల్లో 9, 10 తరగతులకు, ఇంటర్మీడియెట్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు, డిగ్రీలో మూడు సంవత్సరాల వారికి, పీజీలో సెకండియర్ విద్యార్థులకు బోధన ప్రారంభించేలా చర్యలు చేపట్టాయి. వృత్తి సాంకేతిక విద్యా సంస్థల్లో మొదట నాలుగో సంవత్సరం, మూడో సంవత్సరం వారికి బోధన ప్రారంభిం చేందుకు, అదీ ల్యాబ్ తరగతులను మాత్రమే కొనసాగించేలా జేఎన్‌టీయూ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అంతా మాస్క్ ధరించాల్సిందేనని, నో మాస్క్.. నో ఎంట్రీ విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
రెండు వారాలు చూసి...
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ప్రాథమిక పాఠశాలల టీచర్లు మినహా ప్రాథమికోన్నత, ఉన్నత తరగతులకు బోధించే టీచర్లంతా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలకు హాజరయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు 50 శాతం టీచర్ల హాజరును అమలు చేసిన విద్యాశాఖ తాజాగా అందరూ హాజరయ్యేలా నిర్ణయం తీసుకుంది. రెండు వారాలు పరిస్థితిని గమనించి, పెద్దగా ఇబ్బందులు రాకపోతే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులను ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే మార్చి ఒకటో తేదీ నుంచి మిగతా తరగతులను ప్రారంభించాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉంది.