Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మోడి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ సాధ్యమేనా

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ  నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.  అగ్రవర్ణాల్లో ఆర్థి...


అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ  నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.  అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10శాతం కోటా కల్పించాలని ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాలకు చెందినవారంతా ఈ కోటా పరిధిలోకి వస్తారు.
ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం  కేంద్రం పార్లమెంట్‌ ముందు తీసుకు రానున్నారు. చాలా కాలంగా ఈ డిమాండ్‌ ఉండగా.. ఎన్నికలకు ముందే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు కోసం మంగళవారంతో  ముగియనున్న పార్లమెంట్‌ సమావేశాలను రెండు రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15, 16లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ రిజర్వేషన్ పొందడానికి అర్హతలు :
- ప్రధానంగా వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలన్నది మొదటి అర్హత. 
- ఇక వ్యవసాయ భూమి 5 ఎకరాల లోపే ఉండాలి
- వెయ్యి చదరపు అడుగుల లోపు ఇల్లు మాత్రమే ఉండాలి
- నోటిఫైడ్ మున్సిపాలిటీలో 100 గజాలలోపు ఇంటి స్థలం 
- నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీ ప్రాంతంలో 200 గజాలలోపు ఇంటి స్థలం  
ఇప్పటి వరకు రిజర్వేషన్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం పొందని ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్లు అందుతాయని తెలుస్తోంది. కుల ఆధారిత రిజర్వేషన్లు 50శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఈ పది శాతం రిజర్వేషన్‌పై సవరణలను పార్లమెంటు ఆమోదిస్తే కోటా 50శాతం దాటి పోనుంది.
సిపిఎం స్వాగతం 
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం స్వాగతించింది. అగ్రవర్ణాల రిజర్వేషన్‌కు సీపీఎం చాలాకాలంగా డిమాండ్ చేస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. 'రిజర్వేషన్ సిస్టమ్‌ను ధ్వంసం చేయాలని చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మేము మాత్రం అగ్రవర్ణాల వారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిసారి డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఎట్టకేలకు వాళ్లు ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఇది స్వాగతించదగిన పరిణామం' అని పినరయి విజయన్ పేర్కొన్నారు. కాగా, ఉద్యోగాలు, విద్యాసంస్థలలో ప్రవేశాలకు అగ్రకులాలలోని పేదలకు 10% శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ మంత్రి రాందాస్ అథావలె స్వాగతించారు. ప్రభుత్వ చర్యను మాస్టర్‌స్ట్రోక్‌గా అభివర్ణించిన అథావలె పార్లమెంట్ శీతాకాల సమావేశాల చివరిరోజు మంగళవారం నాడు ప్రవేశపెట్టనున్న ఈబిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించకూడదని ఆయన కోరారు. ఇదో మాస్టర్‌స్ట్రోక్..అయితే ఇంకా చాలా స్ట్రోకులు పెండింగ్‌లో ఉన్నాయి. మోడీ ఒక బలమైన బ్యాట్స్‌మన్. మరిన్ని సిక్సర్లు, ఫోర్లు వస్తాయి అని ఆర్‌పిఐ నాయకుడైన అథావలె చెప్పారు.  
మరోవంక, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చే రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం  కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దీంతో ఆ రోజు  లోక్ సభకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ కాంగ్రెస్ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. అటు అధికార బీజేపీ సైతం తమ పార్టీ లోక్ సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. కమలం పార్టీ తమ ఎంపీలకు రేపు లోక్ సభకు హాజరు కావాల్సిందిగా మూడు వాఖ్యాల విప్ ను జారీ చేసినట్టు తెలిసింది.