జమ్మూకశ్మీర్‌లోని 740 కిలోమీటర్ల నియంత్రణ రేఖ (ఎల్వోసీ) భద్రత కోసం ఐదో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరించేందుకు భారత్ సిద్ధమవుతోంది. ...
జమ్మూకశ్మీర్‌లోని 740 కిలోమీటర్ల నియంత్రణ రేఖ (ఎల్వోసీ) భద్రత కోసం ఐదో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరించేందుకు భారత్ సిద్ధమవుతోంది. పాకిస్థాన్‌కు చైనా, టర్కీ, అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి లభిస్తున్న సైనిక సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ సరిహద్దును మరింత పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న మూడు ఎస్-400 వ్యవస్థలు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. నాలుగో వ్యవస్థను అరుణాచల్ ప్రదేశ్‌లోని 1,126 కిలోమీటర్ల వాస్తవ ఆధీన రేఖ (ఎల్ఏసీ) రక్షణ కోసం అసోంలో ఏర్పాటు చేశారు. ఐదో ఎస్-400 వ్యవస్థ ఫిబ్రవరి 2027 నాటికి మోహరింపునకు సిద్ధమయ్యే అవకాశం ఉందని ఇద్దరు ఉన్నతాధికారులు తెలిపారు. సరఫరాకు ముందు నిర్వహించే పరిశీలన కోసం భారత వైమానిక దళ బృందం వచ్చే నెలలో రష్యాకు వెళ్లనుంది.
ఈ ఎస్-400 క్షిపణి వ్యవస్థ 40 నుంచి 400 కిలోమీటర్ల పరిధిలోని బాలిస్టిక్ క్షిపణులు, యుద్ధ విమానాలు, కామికాజ్ డ్రోన్లు, సాయుధ డ్రోన్లను సమర్థవంతంగా కూల్చగలదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్లు భారత భూభాగంపై పడకుండా ఈ వ్యవస్థ పూర్తిగా అడ్డుకుంది. ఆ సమయంలో పాకిస్థాన్ యుద్ధ విమానాలు, ఇతర గగనతల సాధనాలను కూల్చివేయడంలో ఇది కీలక పాత్ర పోషించింది.
2027 నాటికి పాకిస్థాన్‌కు ఐదో తరం జే-35 ఫైటర్ జెట్లను అందించాలని చైనా యోచిస్తోంది. అలాగే పాక్ వైమానిక దళం చైనా తయారీ జే-10 విమానాలు, స్వీడిష్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఉపయోగించి పీఎల్-15 ఈ క్షిపణులను ప్రయోగిస్తోంది. చైనా అందిస్తున్న పీఎల్-15 ఈ, హెచ్‌క్యూ-9బీఈ వంటి వ్యవస్థలను ఎదుర్కొనేందుకు స్టాండ్-ఆఫ్ ఆయుధాల తయారీని భారత్ వేగవంతం చేస్తోంది. భవిష్యత్తు యుద్ధాలు స్టాండ్-ఆఫ్ ఆయుధాలపైనే ఎక్కువగా ఆధారపడతాయని, సుదూర శ్రేణి క్షిపణులు ఉన్నవారికే పైచేయి ఉంటుందని ఒక ఉన్నత సైనిక అధికారి పేర్కొన్నారు.