Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

నాలుగో తరం నుంచి నేరుగా ఆరో తరానికి వెళ్లలేం: ఎయిర్ మార్షల్ రవి కపూర్ - India Cannot Jump to Sixth-Gen Fighters Says Air Marshal

భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల కొరతను కేవలం ఒక్క ప్రాజెక్టుతో పరిష్కరించలేమని సెంట్రల్ ఎయిర్ కమాండ్ మాజీ ఏవోసీ-ఇన్-సి ఎయిర్ ...

నాలుగో తరం నుంచి నేరుగా ఆరో తరానికి వెళ్లలేం: ఎయిర్ మార్షల్ రవి కపూర్

భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల కొరతను కేవలం ఒక్క ప్రాజెక్టుతో పరిష్కరించలేమని సెంట్రల్ ఎయిర్ కమాండ్ మాజీ ఏవోసీ-ఇన్-సి ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) రవి కపూర్ స్పష్టం చేశారు. నాలుగో తరం ఫైటర్ల నుంచి భారత్ నేరుగా ఆరో తరం విమానాలకు మారడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. విమానాల సేకరణను వేగవంతం చేయడంతో పాటు బహుముఖ వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు.

ది లైఫ్ ఆఫ్ సోల్జర్స్ పాడ్‌కాస్ట్‌లో రవి కపూర్ మాట్లాడారు. వైమానిక దళంలో యుద్ధ విమానాల సంఖ్యతో పాటు నాణ్యతను కూడా ఒకేసారి పెంచాల్సి ఉందని ఆయన తెలిపారు. రఫేల్ యుద్ధ విమానాల సేకరణను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. స్వదేశీ ఐదో తరం యుద్ధ విమానం ఏఎంసీఏ ప్రాజెక్టు పనులను ఊహించిన దానికంటే వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తేజస్ మార్క్ 2 విమానాలను వీలైనంత త్వరగా వైమానిక దళంలో చేర్చుకోవడం అత్యంత కీలకమని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం తేజస్ మార్క్ 1ఏ పైనే ఆధారపడటం సరికాదని ఎయిర్ మార్షల్ పేర్కొన్నారు. ఈ విమానం ఆయుధ మోసుకెళ్లే సామర్థ్యం కేవలం 3.5 టన్నుల మేరకే ఉందని గుర్తుచేశారు. దీనికి బాహ్య ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, ఐఆర్‌ఎస్‌టీ పరికరాలను అమర్చితే ఆయుధాల లోడ్ మరింత తగ్గిపోతుందని వివరించారు. వైమానిక దళం వద్ద ఉన్న సుఖోయ్ సు-30ఎంకేఐ ఫ్లీట్‌ను వెంటనే అప్‌గ్రేడ్ చేయాలని, ముఖ్యంగా రాడార్, ఈడబ్ల్యూ సూట్లను ఆధునీకరించకపోతే శత్రువుల ఆధునిక సెన్సర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందు అవి ముప్పును ఎదుర్కొంటాయని తెలిపారు.

యుద్ధ విమానాల వ్యూహంలో ఆర్థిక అంశాలు ఎంతో కీలకమని ఆయన విశ్లేషించారు. ఐదో తరం స్టెల్త్ విమానాలు శత్రువుల రక్షణ వలయాన్ని ఛేదించగలవని, అయితే వాటి కొనుగోలు, నిర్వహణ ఖర్చులు చాలా అధికమని చెప్పారు. స్టెల్త్ లక్షణాల కోసం ఆయుధాలను విమానం లోపల మాత్రమే ఉంచాల్సి రావడంతో వాటి ఆయుధ సామర్థ్యం పరిమితంగా ఉంటుందని పేర్కొన్నారు. యుద్ధ ప్రారంభ దశలో శత్రు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు స్టెల్త్ విమానాలను వాడి, అనంతరం 4, 4.5 తరం యుద్ధ విమానాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించడమే సరైన వ్యూహమని వివరించారు.