భారత్, జర్మనీ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై బెర్లిన్‌లో విస్తృత చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య పార్లమెంటరీ ...
భారత్, జర్మనీ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై బెర్లిన్‌లో విస్తృత చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య పార్లమెంటరీ మార్పిడి కార్యక్రమాల పైనా ఇరువర్గాల మధ్య ముమ్మరంగా చర్చలు సాగాయి.
జర్మనీలో భారత రాయబారి అజిత్ గుప్తే, జర్మన్ బుండ్‌స్టాగ్‌కు చెందిన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, క్రిస్టియన్ సోషల్ యూనియన్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యుల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ ప్రతినిధి బృందానికి యూరోపియన్ వ్యవహారాల ప్రతినిధి, ఎంపీ తిల్మాన్ కుబాన్ నాయకత్వం వహించారు. ఈ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో ఎంపీలు జాన్ మెట్జ్‌లర్, ఫిలిప్ ఎం.ఎ. హాఫ్మాన్, స్టేఫన్ గ్లాసర్, ఎల్లెన్ డెముత్ కూడా ఉన్నారు. ఈ బృందం నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు న్యూఢిల్లీ, బెంగళూరులలో అధికారికంగా పర్యటించనుంది.
నవంబర్ 25న పాల్ లోబే హౌస్‌లో జర్మన్ బుండ్‌స్టాప్ సభ్యుడు, భారత్-జర్మనీ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ వైస్ చైర్మన్ దిర్క్ వైస్‌తో రాయబారి అజిత్ గుప్తే సమావేశమయ్యారు. ఈ భేటీలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. అంతకుముందు నవంబర్ 24న జర్మనీ చాన్సలర్ ఫ్రైడ్రిచ్ మెర్జ్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ ద్వారా మాట్లాడారు. భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పెరుగుతున్న ఊపును ఇద్దరు నేతలు సమీక్షించుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించాలని చర్చించారు.
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలలో కొనసాగుతున్న ప్రగతిపై ప్రధాని నరేంద్ర మోదీ, చాన్సలర్ ఫ్రైడ్రిచ్ మెర్జ్ సంతృప్తి వ్యక్తం చేశారు.