భారత్-చైనా సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాప...

భారత్-చైనా సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడేందుకు ఇరు దేశాలు దౌత్య, సైనిక మార్గాల ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయన్న నివేదికల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్సిరి ప్రాంతంలో చైనా సైనిక మోహరింపులపై ఇరు దేశాల సీనియర్ కమాండర్ల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చలు పలు రోజుల పాటు కొనసాగాయి. అంతకుముందు సెప్టెంబర్ నెలలో కూడా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనిక అధికారులు రెండు విడతలుగా ఫ్లాగ్ మీటింగ్‌లు నిర్వహించారు.
బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ చెన్ షీ ఈ వివరాలు వెల్లడించారు. సరిహద్దులో కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు జనరల్ స్థాయి సమావేశాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అయితే అరుణాచల్ ప్రదేశ్‌ను జాంగ్నాన్గా పిలుస్తూ, అది తమ భూభాగమని చెన్ మరోసారి వాదించారు. భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను తాము గుర్తించబోమని ఆయన పేర్కొన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరాని ప్రాంతమని భారత్ మొదటి నుంచీ స్పష్టం చేస్తోంది. సరిహద్దు ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని కూడా న్యూఢిల్లీ తీవ్రంగా తోసిపుచ్చింది. ఇదే సమావేశంలో భారత్-జపాన్ 2+2 చర్చలపై స్పందించిన చెన్, జపాన్ సైనికీకరణను వేగవంతం చేస్తోందని ఆరోపించారు.