రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'భార్గవాస్త్ర' కౌంటర్ డ్రోన్ వ్యవస్థ డెవలప్‌మెంట్ ట...
రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'భార్గవాస్త్ర' కౌంటర్ డ్రోన్ వ్యవస్థ డెవలప్‌మెంట్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. శత్రువుల డ్రోన్ల సమూహాలను గుర్తించి నాశనం చేసేందుకు ఈ వ్యవస్థను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వాహనంపై అమర్చిన ఈ రెండు అంచెల రక్షణ వ్యవస్థ పరీక్షలు విజయవంతంగా ముగిసినట్లు నాగ్‌పూర్‌కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (ఎస్‌డీఏఎల్) ప్రకటించింది.
ఈ వ్యవస్థ శత్రు డ్రోన్ల సమూహాలను ఎదుర్కొనేందుకు రెండు రకాల ఆయుధాలను ఉపయోగిస్తుంది. ఇందులో ఎయిర్ డిఫెన్స్ రాకెట్లతో పాటు గైడెడ్ మైక్రో మిస్సైళ్లను అమర్చారు. పోఖ్రాన్ పరీక్షల్లో భాగంగా డ్రోన్లను స్వదేశీ సెన్సార్లు, సీ4ఐ నెట్‌వర్క్ ద్వారా గుర్తించి ట్రాక్ చేశారు. అనంతరం ప్రయోగించిన రాకెట్లు నిర్దేశిత లక్ష్యాలను ఖచ్చితంగా తాకగా, మైక్రో మిస్సైళ్ల గైడెన్స్ మరియు టెర్మినల్ హోమింగ్ పనితీరు కూడా నిర్ధారణ అయింది.
ఈ డెవలప్‌మెంట్ ట్రయల్స్ నవంబర్ 20 నుంచి 24 వరకు జరిగాయి. భారత సైన్యం తొలుత 'మేక్ 2' కింద కేవలం రాకెట్ ఆధారిత వెర్షన్-1ను మాత్రమే కోరింది. అయితే ఎస్‌డీఏఎల్ సంస్థ ఆటోమేటిక్ గైడెన్స్, ఇన్‌ఫ్రారెడ్ సీకర్ కలిగిన అత్యాధునిక గైడెడ్ మైక్రో మిస్సైళ్లతో వెర్షన్-2ను కూడా అభివృద్ధి చేసింది. వెర్షన్-1లో 64 ట్యూబుల రాకెట్ లాంచర్ ఉండగా, వెర్షన్-2లో 64 గైడెడ్ మైక్రో మిస్సైళ్లు ఉంటాయి.
ఈ వ్యవస్థలో డ్రోన్లను గుర్తించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు, నిఘా రాడార్లు, పగలు మరియు రాత్రి వేళల్లో పనిచేసే ఎలక్ట్రో-ఆప్టికల్ పరికరాలు ఉన్నాయి. ఏఐ ఆధారిత సీ4ఐ వ్యవస్థ ఈ ట్రాకింగ్, ఫైరింగ్ ప్రక్రియను సమన్వయం చేస్తుంది. మొత్తం వ్యవస్థను ఆర్మీ ఇప్పటికే వాడుతున్న మూడు వాహనాల్లోనే మోహరించవచ్చు. ఈ డెవలప్‌మెంట్ ట్రయల్స్ తర్వాత భార్గవాస్త్ర వ్యవస్థ తదుపరి దశలో భారత సైన్యం చేపట్టే మూల్యాంకనానికి వెళ్లనుంది.