గుజరాత్‌లోని జాతీయ రహదారిపై భారత సైన్యానికి చెందిన మైక్రోలైట్ విమానాలు విజయవంతంగా ల్యాండ్ అయ్యాయి. 2026 నవంబర్ 26న అమృత్‌సర్-జామ్‌నగర్ ఎకనా...

గుజరాత్‌లోని జాతీయ రహదారిపై భారత సైన్యానికి చెందిన మైక్రోలైట్ విమానాలు విజయవంతంగా ల్యాండ్ అయ్యాయి. 2026 నవంబర్ 26న అమృత్‌సర్-జామ్‌నగర్ ఎకనామిక్ కారిడార్‌లోని ఎన్‌హెచ్-754ఏ రహదారిపై సైన్యం ఈ విన్యాసాన్ని చేపట్టింది. అత్యవసర పరిస్థితులు, సైనిక అవసరాల కోసం ఆధునిక రహదారులను ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ ప్రయోగం ద్వారా నిరూపించారు.
భారత సైన్యానికి చెందిన ‘టీమ్ మౌంటైన్ ఈగల్స్’ నాలుగు మైక్రోలైట్ విమానాలను హైవేపై దించి, అనంతరం అక్కడి నుంచే టేకాఫ్ చేయించింది. రహదారిలోని కిలోమీటర్ 946 నుంచి కిలోమీటర్ 949 మధ్య గల విభాగాన్ని ఈ ల్యాండింగ్ కోసం వినియోగించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) సమన్వయంతో, సైన్యం చేపట్టిన ‘వింగ్స్ ఆఫ్ వాలర్ అండ్ యూనిటీ ఎక్స్‌పెడిషన్’లో భాగంగా ఈ సంయుక్త విన్యాసాన్ని నిర్వహించారు.
ఈ విన్యాసం విజయవంతం కావడంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హర్షం వ్యక్తం చేస్తూ, దీనిని చారిత్రాత్మక ప్రయత్నంగా అభివర్ణించారు. సాధారణ రవాణాకే కాకుండా దేశ వ్యూహాత్మక, కార్యాచరణ అవసరాలకు ఆధునిక రహదారులు ఉపయోగపడతాయని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇటువంటి మౌలిక సదుపాయాలు రక్షణ సన్నద్ధతను పెంచడంతో పాటు అత్యవసర స్పందన, రవాణా సామర్థ్యాలను మెరుగుపరుస్తాయని ఆయన తెలిపారు. సైన్యానికి చెందిన టీమ్ మౌంటైన్ ఈగల్స్, ఎన్‌హెచ్ఏఐ విభాగాలను మంత్రి అభినందించారు.
తగిన భద్రతా చర్యలతో ఇటువంటి రహదారి భాగాలను ఏరో-అడ్వెంచర్, పర్యాటక కార్యకలాపాల కోసం కూడా ఉపయోగించే అవకాశం ఉందని నితిన్ గడ్కరీ ప్రస్తావించారు. ఈ విన్యాసం జరిగిన అమృత్‌సర్-జామ్‌నగర్ ఎకనామిక్ కారిడార్ దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తోంది.