Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

NTR Kathanayakudu review

రివ్యూ:  ఎన్టీఆర్‌ రేటింగ్‌: 3/5 ''మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారే ఇవ్వాలి. మనం పోయాకే అది గెలిచామని చెప్పుకోవాలి''...

రివ్యూ: ఎన్టీఆర్‌
రేటింగ్‌: 3/5

''మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారే ఇవ్వాలి. మనం పోయాకే అది గెలిచామని చెప్పుకోవాలి'' ఎన్టీఆర్‌ మనస్తత్వాన్ని, ఆయన ఆలోచనలని, దేనికీ వెరవని స్వభావాన్ని ఈ ఒక్క మాటలో చెప్పారు. నటుడు కావాలనే కోరికతో తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చిన ఎన్టీఆర్‌ తన వ్యక్తిత్వానికి అనుగుణంగా నడుచుకుంటూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎలా ఎదిగారనే దానికి అద్దంపట్టారు.

ఎన్టీఆర్‌ - కథానాయకుడు... తెలుగు సినిమా లెజెండ్‌ కథని, నటుడిగా అతడి జర్నీని కూలంకషంగా చెబుతుంది. అయితే సగటు బయోపిక్‌ మెటీరియల్‌కి అవసరమైన డ్రామా, రైజ్‌ అండ్‌ ఫాల్‌ ఇందులో అంతగా లేవు. ఎట్‌లీస్ట్‌ ఎన్టీఆర్‌ సినీ జీవితం వరకు అయితే ఉద్ధానమే తప్ప పతనం లేకపోవడంతో బయోపిక్‌ జోనర్‌కి అవసరమైన డ్రామా కొరవడింది. అయితే ఎన్టీఆర్‌ స్టోరీని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడానికి, ఎలివేషన్స్‌ ఇవ్వడానికి మాత్రం కావాల్సినంత స్కోప్‌ వుంది.

ఎన్టీఆర్‌ చేసిన సినిమాలు, ఆయన పోషించిన పాత్రలు బేస్‌ చేసుకుని, నేల విడిచి సాము చేయకుండా ఆయనని 'హీరో'లా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. కాకపోతే ఈ క్రమంలో కాస్త అతిశయం, ఇంకాస్త వ్యక్తి పూజ అపుడపుడూ సంభాషణల్లోకి చొరబడింది. ముఖ్యంగా ఆయనని 'దేవుడి'గా చిత్రీకరించే ప్రయత్నం కొంచెం హద్దు దాటిన భావన కలిగిస్తుంది. ఒక వ్యక్తిపై మనకి ఎంతటి అపారమైన గౌరవ మర్యాదలైనా వుండొచ్చు. ఆయనని శ్రద్ధా భక్తులతో కొలవచ్చు. కానీ బయోపిక్‌ అంటే జీవితాన్ని ఆవిష్కరించడమే తప్ప అతిశయానికి ఆస్కారమివ్వరాదు!

ఎన్టీఆర్‌కి కుటుంబంతో వున్న అనుబంధాన్ని, సినిమా అంటే వున్న అపరిమితమైన ఇష్టాన్ని, నటుడిగా చేయాలనుకున్న ప్రయోగాలని, అలాగే పేదల కష్టాల పట్ల వున్న కన్సర్న్‌ని సమాంతరంగా చూపిస్తూ, సినిమా నుంచి జీవితానికి, జీవితం నుంచి సినిమాకి జరుగుతున్న ట్రాన్సిషన్‌ ఎఫర్ట్‌లెస్‌గా చేస్తూ క్రిష్‌ సమర్ధవంతమైన, ఆసక్తికరమైన కథనం రాసుకున్నాడు. ఎన్టీఆర్‌ చేసిన కొన్ని ఐకానిక్‌ సినిమాల వెనుక వున్న కథని క్లుప్తంగా చూపిస్తూ, అలాగే మరచిపోలేని పలు సన్నివేశాలని, మరపురాని పాటలని కూడా అక్కడక్కడా టచ్‌ చేస్తూ ఎంటర్‌టైనింగ్‌గా కథ చెప్పడంలో క్రిష్‌ సక్సెస్‌ అయ్యాడు.

కేవలం ఎన్టీఆర్‌ పాత్రలు, ఆయన జీవితంలో ఎదురైన సంఘటనలు అని కాకుండా సహ నటులతో ఆయనకి వున్న అనుబంధాన్ని, అలాగే తన తమ్ముడికి (దగ్గుబాటి రాజా తన పాత్రలో ఒదిగిపోయాడు) అన్నయ్యపై వున్న అపారమైన అనురాగాన్ని కూడా క్రిష్‌ బాగా క్యాప్చర్‌ చేసాడు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ - ఏఎన్నార్‌ల (సుమంత్‌ తన తాతగారి పాత్రకి న్యాయం చేసాడు) నడుమ వున్న ఆ బ్రదర్లీ రిలేషన్‌ని ఎక్కడా హద్దులు దాటకుండా భలేగా చూపించారు. 'మహానటి' సావిత్రి (నిత్యమీనన్‌ గెటప్‌ చక్కగా కుదిరింది) దుబారా ఖర్చులకి, డబ్బంటే లెక్క లేని సేవలకి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల చిరు మందలింపు నైస్‌ టచ్‌.

సన్నివేశాల పరంగా కొన్నిచోట్ల క్రిష్‌ డ్రామాని పండించడంలో తన పనితనాన్ని బ్రహ్మాండంగా చూపెట్టాడు. తనతో పాటు ఆకలి తిప్పలు పడ్డ తాతినేని ప్రకాశరావుకి దర్శకుడిగా తొలి అవకాశాన్ని తన నిర్మాణంలో ఎన్టీఆర్‌ ఇవ్వడం... ఆ సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం చప్పట్లు కొట్టిస్తుంది. 'కృష్ణుడిగా ఎన్టీఆర్‌ ఏమిటి' అన్నవారు ఆయనని ఆ గెటప్‌లో తొలిసారి చూసినపుడు ఇచ్చే రియాక్షన్‌ ఫాన్స్‌కి గూస్‌బంప్స్‌ ఇస్తుంది. ఈ సన్నివేశ చిత్రీకరణ మొత్తంలో క్రిష్‌ టాలెంట్‌ అపారం, అమోఘమని చెప్పాలి. వృత్తి పట్ల ఎన్టీఆర్‌కి వున్న నిబద్ధతని చాటే 'రావణ బ్రహ్మ' సన్నివేశం, తనయుడు చనిపోయినపుడు షూటింగ్‌ పూర్తి చేసి కానీ కదలని వైనం ఎన్టీఆర్‌ పట్ల గౌరవాన్ని మరింత పెంచుతాయి.

బాలకృష్ణ విషయానికి వస్తే 'యంగ్‌ ఎన్టీఆర్‌'గా కనిపించడంలో కాస్త ఇబ్బంది ఎదురైనా కానీ మెచ్యూర్డ్‌ గెటప్‌లో మాత్రం బాలయ్య తండ్రి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ అన్నిట్లోను 'పెద్దాయన'ని గుర్తు చేసాడు. ఒకసారి విగ్‌ తీసేసి మెచ్యూర్డ్‌ లుక్‌లోకి మారిన తర్వాత బాలకృష్ణ అభినయంలో చాలా మార్పు కనిపిస్తుంది. ఆ గాంభీర్యం, ఆ డాంబికం ఆయన కదలికల్లో, ముఖ కవళికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ మెప్పిస్తుంది. 'అన్నదమ్ముల అనుబంధం' ప్రింట్స్‌ని హోల్డ్‌ చేసి ఎమర్జన్సీ టైమ్‌లో రిలీజ్‌ కానివ్వమని పోలీసులు హూంకరించనిపుడు ఎన్టీఆర్‌ మాటలతోనే విరుచుకుపడే దృశ్యం ఈ చిత్రానికే హైలైట్‌గా నిలిచింది. 'మీవి సినిమా తుపాకులు కాకపోవచ్చు. కానీ నాది సినిమా గుండె. 'షూటింగ్‌'కి భయపడదు' లాంటి పదునైన సంభాషణలు సన్నివేశాన్ని మరింత రసవత్తరంగా మార్చాయి.

ఇదే క్రమంలో ఎన్టీఆర్‌పై వచ్చిన కొన్ని విమర్శలకి కూడా సమాధానమిచ్చిన తీరు బాగుంది. తన కూతుళ్ల కంటే తక్కువ వయసున్న హీరోయిన్లతో డాన్సుల గురించి కుటుంబం ఆయనని నిలదీయడం, దానికి ఎన్టీఆర్‌ ఇచ్చే సమాధానం ఆకట్టుకుంటాయి. కృష్ణ, శోభన్‌బాబుల రాకతో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల పని అయిపోయిందనే టైమ్‌లో 'దానవీర శూర కర్ణ'తో ఎన్టీఆర్‌ తిరిగి బౌన్స్‌ బ్యాక్‌ అవడం లాంటి ఫ్యాక్ట్స్‌ తెలుగు సినిమా తొలి సూపర్‌స్టార్‌కి సలామ్‌ కొట్టిస్తాయి.

అంతవరకు ఎంగేజింగ్‌గా సాగిపోయిన చిత్రం ఒక్కసారి ఎన్టీఆర్‌ అంతరంగ మధనంలో పడ్డాక అమాంతం బ్రేకులు పడినట్టు ముందుకు కదలలేకపోతుంది. రాజకీయ ప్రవేశానికి కారణమైన పరిస్థితులు, సంఘటనలని చాలా డీటెయిల్డ్‌గా చూపించడం, ఇక్కడ ఎలివేషన్స్‌కి తావు లేకపోవడంతో పతాక సన్నివేశాలు బాగా డల్‌ అయిపోయాయి. రెండో భాగానికి వెళ్లే ముందు తీసుకున్న విరామానికి అవసరమైన 'బ్రేక్‌', ఈ సినిమా ఎండ్‌ చేయడానికి కావాల్సిన 'హై' మిస్‌ అవడం వల్ల అసంతృప్తితో, సగం కథ చూసిన ఫీలింగ్‌తో బయటకి రావాల్సి వస్తుంది. రెండు భాగాలుగా కాక ఒకే సినిమాగా విడుదల చేసినట్టయితే పతాక సన్నివేశం బాగా కుదిరేది.

నటీనటులు అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నటనా అనుభవం లేని క్రిష్‌, సాయి మాధవ్‌ కూడా అనుభవజ్ఞులైన ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారు. తెరవెనుక ప్రతి ఒక్కరూ చక్కని ప్రతిభ చూపించారు. సంభాషణలు, సినిమాటోగ్రఫీ, సంగీతం, ప్రొడక్షన్‌ డిజైన్‌ అన్నీ చాలా చక్కగా కుదిరాయి. ఆ కాలం వాతావరణాన్ని ప్రతిబింబించే ఆర్ట్‌కి తోడు, డ్రామాని ఎలివేట్‌ చేసిన కెమెరా, మ్యూజిక్‌ ఈ చిత్రానికి ప్లస్‌ అయ్యాయి. 'మహానటి' మాదిరిగా ఎమోషనల్‌గా కనక్ట్‌ చేసేంత డ్రామాకి తావు లేకపోయినా, తొలి సూపర్‌స్టార్‌ ఎదుగుదలని, ఆయన ఆలోచనలు, అంతరంగాన్ని ఆవిష్కరించి, ఆసక్తికరంగా చెప్పడంలో 'ఎన్టీఆర్‌' టీమ్‌ సక్సెస్‌ అయింది.