వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన కీలకమైన మూడు బిల్లులను ఆమోదించిన తర్వాత పార్లమెంట్ కార్మిక రంగంలో సంస్కరణలకు సంబంధించిన మూడు కీలకమై...
వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన కీలకమైన మూడు బిల్లులను ఆమోదించిన తర్వాత పార్లమెంట్ కార్మిక రంగంలో సంస్కరణలకు సంబంధించిన మూడు కీలకమైన బిల్లులను కూడా ఆమోదించింది.
కంపెనీల మూసివేతకు చెందిన అవరోధాల తొలగింపు, 300 మంది వరకు కార్మికులు పనిచేసే కంపెనీల్లో ప్రభుత్వ అనుమతి లేకుండానే వారిని తొలగించేందుకు అనుమతి ఈ బిల్లుల ద్వారా లభిస్తుంది.
ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్‌కు నిరసన తెలియచేస్తూ కాంగ్రెస్, వామపక్షాలతోసహా ప్రతిపక్షాలు సమావేశాన్ని బహిష్కరించిన నేపథ్యంలో పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రతకు సంబంధించిన మూడు కార్మిక సంస్కరణలను మూజువాణి వోటుతో రాజ్యసభ ఆమోదించింది.
లోక్‌సభ మంగళవారం ఆమోదించిన ఈ మూడు బిల్లులకు రాజ్యసభ ఆమోదం కూడా లభించడంతో వీటిని ఆమోదముద్ర కోసం రాష్ట్రపతికి ప్రభుత్వం పంపనున్నది. మూడు కార్మిక సంస్కరణల బిల్లులపై కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ రాజ్యసభలో సమాధానమిస్తూ మారిన వ్యాపార పరిస్థితులలో పారదర్శకమైన విధానాలను తీసుకురావడమే ఈ బిల్లుల ఉద్దేశమని చెప్పారు.
ఇప్పటికే 16 రాష్ట్రాలలో 300 మంది వరకు పనిచేసే కంపెనీలలో ప్రభుత్వ అనుమతి లేకుండానే కార్మికుల తొలగింపు, మూసివేత, లేఆఫ్ ప్రకటించే విధానాలు ప్రవేశపెట్టాయని ఆయన తెలిపారు. 100 మంది కార్మికులు పనిచేసే కంపెనీలకే దీన్ని వర్తింపచేయడం వల్ల ఉపాధి కల్పనకు ఇది మంచిది కాదని, దీని వల్ల ఉద్యోగులు ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు.
ఈ సంఖ్యను 300కు పెంచడం వల్ల ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి యాజమాన్యాలు కూడా ముందుకు వస్తాయని, దీని వల్ల ఉపాధి కల్పన పెరుగుతుందని ఆయన చెప్పారు. కార్మికుల ప్రయోజనాలను ఈ బిల్లులు పరిరక్షిస్తాయని, ఇపిఎఫ్, ఇఎస్‌ఐ పరిధిని విస్తరించడం ద్వారా వారికి సామాజిక భద్రత లభిస్తుందని మంత్రి తెలిపారు.
దాదాపు 40 కోట్ల అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత నిధి ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు. 29కి పైగా కార్మిక చట్టాలను నాలుగు చట్టాలలో విలీనం చేయడం జరిగింది, వీటిలో ఒకటి (వేతనాల బిల్లు, 2019) ఇదివరకే ఆమోదం పొందిందని ఆయన చెప్పారు.